ఏపీలో జూన్ 10 వరకూ లాక్ డౌన్ పొడిగింపు.. ఏపీలో 10వేల లోపు నమోదైన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడిగించింది. జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న కర్ఫ్యూ సడలింపులో ఎలాంటి మార్పు చేయలేదు. ఇంతకు ముందు లాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కర్ఫ్యూ కొనసాగించడం వల్ల కరోనా ప్రభావాన్ని తగ్గించవచ్చని భావించారు. అనుకున్నట్లుగానే జూన్ 10 వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి బాగా తగ్గింది. గత 24 గంటల్లో 83,461 కరోనా పరీక్షలు నిర్వహించగా కేవలం 7,943 కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తూర్పు గోదావరి (1,877), చిత్తూరు (1,283) జిల్లాలలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 231 కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 19,845 మంది కరోనా నుంచి కోలుకోగా, 98 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మరణాల సంఖ్య 10,930కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,93,085 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకినవారిలో 15,28,360 మంది కోలుకోగా, ఇంకా 1,53,795 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ ను పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నాడు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు ఇచ్చారు. ఇంటి నుంచి బయటికి వచ్చిన వారు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపు ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతించిన ప్రభుత్వం కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, మరికొన్ని గంటలు అదనపు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మార్చారు. బ్యాంకులు ఇకపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి. ఈ మేరకు రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ వెల్లడించింది. లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఉండగా… బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే పనిచేశాయి.
Source - https://nationalisthub.com/lockdown-extended-in-andhra-pradesh/
No comments:
Post a Comment